మృత్యుపాశాలు! | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశాలు!

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి.. విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తం... పట్టించుకోని అధికారులు..

చెరువుల సాగులో నిబంధనలకు పాతర అస్తవ్యస్తంగా విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాట్లు విద్యుత్‌ఘాతానికి గురై నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి లోపించిన మత్స్యశాఖ, విద్యుత్‌ అధికారుల పర్యవేక్షణ

ఆక్వా చెరువుల వద్ద
నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి..

దింటిమెరక–హంసలదీవి రహదారిని ఆనుకొని రొయ్యల చెరువుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, హైటెన్షన్‌ విద్యుత్‌లైన్‌

కోడూరు: ఆక్వా చెరువుల సాగులో యజమానులు నిబంధలకు పాతరేస్తున్నారు. ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్లు చెరువుల వద్ద పని చేసే కూలీల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా కోడూరు మండలంలో రెండు రోజుల వ్యవధిలో చెరువుల వద్ద ముగ్గురు కూలీలు విద్యుత్‌ఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ నిర్వాహణ తీరుపై అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి. కోడూరు మండలం సముద్ర తీరానికి అతీ సమీపంలో ఉండడంతో కృష్ణానది పరివాహాక రైతులు, సముద్ర తీరప్రాంత రైతులు ఆక్వా సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగానే వి.కొత్తపాలెం, విశ్వనాథపల్లి, సాలెంపాలెం, వేణుగోపాలపురం, పిట్టల్లంక, ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయతిప్ప, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, మందపాకల, పోటుమీద, చింతకోళ్ల ప్రాంతాల్లో సుమారు 8వేల ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువుల తవ్వకాలు చేపట్టి ఆక్వా సాగు నిర్వహిస్తున్నారు.

చెరువులను లీజుకు తీసుకున్న బడాబాబులు

తీర ప్రాంత గ్రామాల్లో రైతులు చెరువుల సాగుకు అయితే ఖర్చులు భరించే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాంత రైతులు లీజు పద్ధతిలో ఇతర వ్యక్తులకు చెరువుల సాగుకు ఇస్తున్నారు. భీమవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, హైదరాబాద్‌, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన బడాబాబులు ఈ చెరువులను లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. ఒక్కొ బడాబాబు సుమారు 200 నుంచి 300 ఎకరాల చెరువులను లీజుకు తీసుకొని వాటికి సంబంధించిన మరమ్మతులతో పాటు వీటికి అవసరమైన విద్యుత్‌ సౌకర్యానికి కూడా సమకూర్చుకుంటున్నారు. చెరువుల వద్ద పని చేసేందుకు ఒడిశా, బీహార్‌, అస్సాంతో పాటు స్థానిక వ్యక్తుల కూడా పెట్టుకుంటున్నారు.

చెరువుల సాగుకు విద్యుత్‌ సౌకర్యం తప్పనిసరిగా కావాలి. చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్‌ కోసం ఏర్పాటు చేసే ఫ్యాన్లు తిరగడానికి, రాత్రి వేళ లైటింగ్‌, మోటర్లు తిరగడానికి విద్యుత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆక్వా చెరవుల వద్ద విద్యుత్‌ నిర్వాహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్లును సరైన పద్ధతిలో పెట్టకుండా చేతికందే ఎత్తులో ఉంచడం, ఫ్యూజ్‌ బాక్స్‌లను కర్రలకు కట్టి చెరువుల అంచన పెట్టడం వంటి చెరువులు యజమానులు చేస్తున్నారు. విద్యుత్‌ స్తంభాల నుంచి వెళ్లే హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు కూడా కిందకు వేలాడుతూ కనిపిస్తున్నారు. అనేక చెరువుల వద్ద మోటర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడంతో ఇవి కూడా ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రధాన రహదారుల అంచన కూడా ఏర్పాటు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.

ఆక్వా చెరువుల వద్ద బడాబాబులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా కూడా మత్స్యశాఖ, విద్యుత్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యూజు బాక్స్‌లు, విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసే సమయంలో బడాబాబులకు అనుకూలంగా వ్యవహరించడంతోనే ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు బహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంటికి మీటర్లు ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు విధించే అధికారులు చెరువులకు మాత్రం విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏవిధమైన నిబంధనలు పాటించడం లేదని వాపోతున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వుతున్నా కూడా వాటిని సాగు చేసేందుకు అనుమతులు ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆక్వా చెరువుల వద్ద విద్యుత్‌ వ్యవస్థపై సరైన పర్యవేక్షణ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement