జి.కొండూరు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేదిలేదని జి.కొండూరు మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని మునగపాడు, సున్నంపాడు గ్రామాల పరిధిలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమిని అక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వ భూమిపై పచ్చనేతల కన్ను’ కథనాన్ని సాక్షి శుక్రవారం ప్రచురించింది. ఈ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇన్‌చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కంప చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లకపోతే జేసీబీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పొగాకు పుల్లారెడ్డి
ఇబ్రహీంపట్నం: వేసవి కాలంలో వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఏపీజెన్‌కో ఇన్‌చార్జ్ డైరెక్టర్ పోగాకు పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ ఉద్యోగుల విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలకు సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయడంలో లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. హెచ్‌టీ, ఎల్టీ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని సూచించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం, అంబారుపేట, మక్కపేట ఏరియాలో మూడు నూతన సబ్ స్టేషన్‌లను సుమారు రూ.14 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఎస్‌ఈ యు.అన్నమయ్య, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కంటెయినర్ లారీ ఢీకొని కూలీ దుర్మరణం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండపల్లి ఆప్మెల్ సెంటర్‌లో 30వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. ఆప్మెల్ సెంటర్‌కు చెందిన వేముల వెంకటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. కూలి పనికి వెళ్లి తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో తన టీవీఎస్ మోపెడ్‌పై ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో హైవేపై మలుపు తిరుగుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు విజయవాడ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని మరో కారు డ్రైవర్ దుర్మరణం
కంచికచర్ల : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నెల్లూరి సుజన తన కుటుంబసభ్యులతో కలిసి నిడమానూరులో వివాహ కార్యక్రమానికి గురువారం వచ్చారు. అదేరాత్రి తిరిగి ప్రయాణం అయ్యారు. కంచికచర్ల సమీపంలో మిశ్రా డాబా వద్దకు రాగానే శుక్రవారం తెల్లవారుజామున కారు రోడ్డు పక్కన ఆపి కారు డ్రైవర్ కొంగర ప్రశాంత్ కుమార్ మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. తిరిగి కారు ఎక్కుతున్న సమయంలో వేగంగా వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తలకు తీవ్రగాయమయింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్దలానికి చేరుకుని బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్‌కుమార్ మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు.


