తప్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులా మీకు నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరోలా వ్యవహరిస్తున్నారు నా పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపగలరా? మంత్రి రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
చిలకలపూడి(మచిలీపట్నం): చెత్త రాజకీయాలకు కేరాఫ్‌గా మంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. బందరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం మార్కెట్ యార్డులో హౌసింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు స్టీలును తరలించడాన్ని ప్రశ్నించినందుకు అధికారులను బెదిరిస్తున్నానంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకు పడ్డారు. హౌసింగ్ అధికారుల అకృత్యాలపై ప్రతిపక్ష పార్టీ నాయకునిగా తాను ప్రశ్నిస్తే మంత్రికి ఉలికిపాటు ఎందుకో అర్ధం కావటం లేదన్నారు. ప్రభుత్వంలోని లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామంటూ చెబుతున్న మంత్రి ఎంయుడీఏకు సంబంధించి సేకరించిన భూమిలో ఆరు నుంచి 10 అడుగుల లోటు తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు ఇస్తే ఇంత వరకు ఏం విచారణ చేపట్టారని ప్రశ్నించారు. స్పందించకపోగా ఎంయుడీఏ చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని ఒత్తిడి తెచ్చి పదవి నుంచి దిగిపోయేలా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. విచారణ చేస్తామని చెప్పే మంత్రి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో చేసిన పాపాలపై ఏం విచారణ చేశారో కూడా చెప్పాలని సవాల్ విసిరారు.
స్టీలు తరలింపుపై ఆదేశాలు చూపగలరా..
మచిలీపట్నం నుంచి హౌసింగ్ అధికారులు ఇతర జిల్లాలకు స్టీలును తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జీవో లేదా హౌసింగ్ ఎండీ ఆర్డర్ ఉండకుండా ఎలా తరలిస్తారన్నారు. లారీ వెళ్లిపోయాక అర్ధాంతరంగా హౌసింగ్ పీడీ ఆర్డరు ఇవ్వటం చూస్తుంటే ప్రజలకే అర్ధమవుతోందన్నారు. సుమారు రూ. 25 లక్షల విలువ గల 25 టన్నులు స్టీలు దోచుకోవటం కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే బెదిరింపులు అంటావా అని నిలదీశారు. అసలు బందరుకోటలో కట్టే మీ ఇంటికి, కాంప్లెక్స్‌లకు ప్లాన్ ఉందా, లేదా సమాధానం చెప్పాలని అడిగితే దానిపై మాట్లాడకుండా బురదజల్లుతారా అని ప్రశ్నించారు.
నిజాలు నిగ్గు తేల్చగలరా..?
మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నిజాయితీగా వ్యవహరించిన నాపై ఆరోపణలు చేస్తున్నారని నిజాలు నిగ్గు తేల్చగలరా అని రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. తాను నిర్మించుకున్న గోడౌన్‌కు సంబంధించిన భూములు రైతులను బెదిరించి లాక్కున్నానని అంటున్నావని నువ్వు ఏ ఒక్క రైతుతో అయినా సాక్ష్యం చెప్పించగలావా అని ప్రశ్నించారు. దొంగ పట్టాలు ఇచ్చానని ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టారని ఇంత వరకు దానిని ఎందుకు రుజువు చేయలేకపోయారని అన్నారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న రవీంద్ర పట్టణ సుందరీకరణ పేరుతో పేదల బడ్డీ కొట్లు కూలగొట్టారని ఆరోపించారు. కుమ్మరిగూడెం ఇటుక బట్టీలు తొలగించేందుకు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వారికి అండగా తాము రాజీ లేని పోరాటం చేస్తుంటామన్నారు. విజయవాడ కేంద్రంగా మంత్రి కొల్లు రవీంద్ర వైకేనల్ ఏర్పాటు చేసి నెలకు రూ. 85 లక్షలు జీతభత్యాలను చెల్లిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొల్లు నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న గుమ్మటాల చెరువు అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రహదారులు, తాగునీటి పైపులు ఏర్పాటు చేయటం కోర్టు ధిక్కారం కాదా అన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.


