బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఆందోళన

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

జీతాలు ఇవ్వలేని దుస్థితి

నల్ల రిబ్బన్లు , ప్లకార్డులతో నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ ‘మౌన’ దీక్ష

భవానీపురం(విజయవాడపశ్చిమ): జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కార్యక్రమాల్లో మొదటి నుంచి భాగస్వాములుగా ఉన్న 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్ల (ఎంఎస్‌ఎంఈ) బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం, కార్పొరేట్‌ సంస్థలపై చూపుతున్న పక్షపాత ధోరణిపై నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని ఏపీ ఇంజినీర్‌–ఇన్‌–చీఫ్‌ కార్యాలయం వద్ద పెండింగ్‌ బిల్లుల కోసం నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో చేపట్టిన ఆందోళన సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడుతూ టెండర్లు దక్కించుకుని పనులు చేసిన అనంతరం బిల్స్‌ సబ్మిట్‌ చేసి ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుకూ చిన్న కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాలని.. ప్రభుత్వం వద్ద ఈ బిల్లులు ఉన్నాయని, ఏడాదిగా పేమెంట్స్‌ జరుగుతున్న విధానం విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఫిబ్రవరి 2025 నుంచి ప్రభుత్వం సుమారు రూ.1,331 కోట్లు విడుదల చేసిందని, ఇందులో కార్పొరేట్‌ సంస్థలకు రూ.932 కోట్లు చెల్లింపులు చేయగా ఆ మొత్తంలో మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ కూడా ఉండటం దుర్మార్గమని పేర్కొన్నారు. అదే సమయంలో 750కిపైగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు కేవలం రూ.263 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లుగా ప్రభుత్వ పనులు చేసేందుకు ఆస్తులు కుదవపెట్టి, తెచ్చిన అప్పులు తీర్చలేక తమ బ్యాంక్‌ అకౌంట్లు ఎన్‌పీఎగా మారాయని అసోసియేషన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ వద్ద పని చేస్తున్న రోజువారీ కార్మికులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిం దని, గత్యంతరం లేక రోడ్డెక్కి పోరాటానికి సిద్ధపడ్డామని చెప్పారు. తమ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిర్మించుకుంటున్న గృహ నిర్మాణ పనులకు కూలీలుగా వెళ్లి శ్రమదానం చేసి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన శాఖ మంత్రి, డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందించక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement