ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఘాట్‌రోడ్డు నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని దుర్గగుడి వైదిక కమిటీ పేర్కొంది. ప్రతి నెలా పౌర్ణమి రోజు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. గురువారం తెల్లవారుజామున ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాల సెంటర్, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి భక్తులు, సేవా సిబ్బంది పాల్గొనాలని కోరారు.
నందిగామ రూరల్: అతిసార వ్యాధి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలు భయాందోళనకు గురికావద్దని డీఎంహెచ్‌వో సుహాసిని పేర్కొన్నారు. చందాపురంలో సోమవారం ఆమె పర్యటించారు. ముందుగా గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అతిసార కేసుల పరిస్థితి, కారణాలు, ప్రాథమిక నివేదికలను అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేస్తూ ఎనిమిది ఆర్‌ఆర్‌టీ బృందాలు గ్రామంలో సర్వే చేస్తున్నాయన్నారు. ఆస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారని కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెండు, మూడు రోజుల పాటు వైద్యారోగ్య, పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు మల్లీశ్వరి, పద్మజ, శ్రీహరి వెంకటేశ్వర్లు, సరిత, భాను కిరణ్, జ్యోతి పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి అందులో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం 31 రోజులకు నోట్ల ద్వారా రూ.13,77,046, చిల్లర ద్వారా రూ.1,44,060 వెరసి మొత్తం రూ.15,21,100 వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్‌వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, నూతలపాటి లక్ష్మీ పావని, వేమవరం ర సర్పంచ్ మన్నెం పద్మావతి, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో కానుకల్ని లెక్కించారు. లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, మచిలీపట్నం, ఉయ్యూరు, వేమవరం సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లోపతిలోనే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇతర కోర్సుల విద్యార్థులు, ఫ్యాకల్టీ పరిశోధనలతో పాటు క్రీడా ప్రోత్సాహకాల కోసం ఏటా రూ.22.13 కోట్ల వ్యయం చేయనున్నట్టు ప్రకటించారు. అమరావతిలో విశ్వవిద్యాలయానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని చేసిన ప్రతిపాదన సీఆర్డీఏ పరిశీలనలో ఉందని తెలిపారు. వర్సిటీ రీసెర్చ్, డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ మాట్లాడుతూ డిసీజ్ మోడలింగ్, డెసిషన్ సెంటర్‌ను రూ.5.73 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.


