సమన్వయంతో మాతృ, శిశు మరణాల తగ్గింపు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో మాతృ, శిశు మరణాల తగ్గింపు

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించడానికి వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం సబ్‌–డిస్ట్రిక్ట్‌ స్థాయి మాతృ, శిశు మరణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎన్‌ఎంలు, ఆశలు సామర్థ్యాన్ని పెంపొందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రత్యేక దృష్టి పెట్టాలి

శిశు ఆహార పద్ధతులు, ప్రసవానంతర శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గర్భిణులు, నవజాత శిశువుల్లో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం అందించాలన్నారు. అనధికార వైద్యుల వద్దకు పంపడం పూర్తిగా నివారించాలని సూచించారు. తల్లులు, కుటుంబ సభ్యులకు భయపడకుండా స్పష్టమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, ప్రమాద సూచనలు, సంక్లిష్ట పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైరిస్క్‌ గర్భధారణలు, దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు. గర్భిణులు తప్పనిసరిగా నియమిత గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలని, స్కాన్లు, 2డీ ఎకో పరీక్షల ప్రాముఖ్యతను వివరించి, సమస్యలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మొత్తం 6 శిశు మరణాలు, 2 మాతృ మరణాల కేసులను విశ్లేషించి, సేవల్లో లోపాలను గుర్తించి నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, ఫీల్డ్‌ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ యుగంధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement