బస్సుల్లోనే బతుకులు బుగ్గి | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లోనే బతుకులు బుగ్గి

Mar 27 2026 9:52 AM | Updated on Mar 27 2026 9:52 AM

● భద్రత కరువు ● మార్కాపురం ఘటనతో ఉలిక్కిపడిన ప్రయాణికులు ● నామమాత్రపు తనిఖీలతో సరి

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘటనలు

హైద్రాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్లుతున్న కావేరీ ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.

ఏడేళ్ల క్రితం జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండలం వద్ద జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై 10 మంది చనిపోయారు.

విజయవాడలో పార్కింగ్‌ చేసిన బస్సులో మంటలు ఎగిసి పడి బస్సు దగ్ధమైంది.

ప్రయాణికుల భద్రత పట్టదా?

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రైవేట్‌ బస్సులంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.వరుసగా ప్రైవేట్‌ బస్సులు ప్రమాదాలకు గురికావడం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గతేడాది కర్నూలు జిల్లాలో, కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ జిల్లా కీసర సమీపంలో.. తాజాగా మార్కాపురంలో ఇలా రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది, మార్కాపురం బస్సు ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు.

ప్రైవేటు ట్రావెల్స్‌కు విజయవాడ రాజధాని

ప్రైవేటు ట్రావెల్స్‌కు విజయవాడ.. రాజధానిగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం 500 పైగా బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో చాలా వరకు సరైన పర్మిట్‌లు, ఫిట్‌నెస్‌ లేకపోవడం, సేఫ్టీ పాటించకుండానే రోడ్లెక్కుతున్నాయి. అతి వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఒకే నంబరుతో ఒక బస్సు హైదరాబాద్‌, మరో బస్సు బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తున్నా అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బస్సుల్లో సిబ్బంది వంట కోసం సామగ్రి, స్టౌ, గ్యాస్‌ వంటివి బస్సు కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పెడుతున్నారు. కొందరు అందులోనే మద్యం తాగుతున్నారు. మరికొన్ని బస్సులు సరుకు రవాణా చేస్తున్నాయి. ఎక్కవగా టైర్లు తరలిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగి టైర్లకు నిప్పంటుకుంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. హనుమాన్‌పేట నుంచి బయలు దేరే బస్సుల్లో సరుకు రవాణా చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి సిటీ దాటే వరకు డబ్బులు ఇస్తూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం తనిఖీలు చేయకుండా పనికానిచ్చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న వరుణ్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి.

నిత్యం రాష్ట్రంలో ఏదో మూల ప్రైవేటు బస్సులు కాలిబూడిదైపోతున్నాయి. ప్రయాణికులు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించదా? ఇంకెన్ని అమాయక ప్రాణాలు పోవాలి? నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భద్రత కల్పించాలి.

– వేమా సురేష్‌, కంచికచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement