ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వాడపల్లికి చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన కొప్పుల దుర్గా దివ్య కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఆధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై ఆహ్లాదం పెంపునకు చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగణంలో పచ్చదనం పెంపునకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులతోపాటు ఆధ్యాత్మికం, ఆహ్లాద వాతావరణం పెంపునకు నిపుణులైన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రమాకాంత, శరవణన్, శరత్‌తోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్ గురువారం ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల పరిసరాలు, వాటర్ ట్యాంకులు, నూతన పూజా మండపం, యాగశాల, మల్లేశ్వరస్వామి ఆలయం, మహా మండపం దిగువ ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థాన మాస్టర్‌ప్లాన్‌ను ఈవో శీనానాయక్ ఆ బృందానికి వివరించారు.
జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా పని చేయాలి
గన్నవరం: జీరో బ్రేక్ డౌన్ లక్ష్యంగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి కె.వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోను గురువారం ఆయన సందర్శించారు. బస్ స్టేషన్‌లో ప్రయాణికులు కూర్చునే సీట్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి సదుపాయాలను, మరుగుదొడ్లు, బస్టాండ్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించి అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. బస్సులు సర్వీస్‌కు పంపిన తర్వాత ఎటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. బస్సులకు మరమ్మతులు నిర్వహించి కండిషనల్‌లో ఉంచాలని సూచించారు. అనంతరం గ్యారేజ్‌లో సర్వీస్ చేసిన బస్సులో రోడ్డు టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన డీపీటీవో వాహన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన వెంట డిపో మేనేజర్ పి.శివాజి, గ్యారేజ్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్‌చార్జ్ మధు, పలువురు సూపర్‌వైజర్లు తదితరులు ఉన్నారు.
అవార్డులు బాధ్యతలను పెంచుతాయి
విజయవాడ కల్చరల్: అవార్డులు బాధ్యతలను పెంచుతాయని కామ్రేడ్ జీఆర్‌కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాలు అందకున్న చిత్రకారులకు అభినందన సభను బాలోత్సవ భవన్‌లో పోలవరపు సాహితీ సమితి, డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యాన నిర్వహించారు. గోళ్ల నారాయణరావు చిత్రకారులను అభినందించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిత్రకళలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. చిత్రకారులు ఎన్‌ఎస్ వెంకట్రావు, వజ్రగిరి, కళాసాగర్, పి.రమేష్, పట్నాల సుధాకర్‌ను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో మోతుకూరి ఆంజనేయులు, డాక్టర్ సీహెచ్ రామచందర్, కె. సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉపేంద్ర, ఆంజనేయులు, ప్రసాద్ పాల్గొన్నారు.


