● సీఎన్‌సీ మిషన్లు, కలప దగ్ధం ● రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం
చల్లపల్లి: చెక్కలపై డిజైన్లు చెక్కే ఉడ్ కార్వింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి, రెండు సీఎన్‌సీ మిషన్లు, విలువైన టేకు, ఇతర కలప కాలిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని పెదకళ్లేపల్లి రోడ్డులోని మేకలడొంక వద్ద ఉన్న శ్రీసాయి టింబర్ డిపో అండ్ ఉడ్‌వర్క్ షాపులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు అన్నీ కులుపుకొని రూ.10లక్షలకుపైగా నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు.
వివరాలు ఇవి..
మోపిదేవికి చెందిన అద్దంకి సత్యనారాయణ కంప్యూటర్ల సహాయంతో యంత్రాల ద్వారా కలపపై డిజైన్లు వేసే ఉడ్ కార్వింగ్ పనులు చేస్తుంటారు. సీజన్ కావటంతో పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. బుధవారం రాత్రి 8గంటల సమయంలో కంప్యూటర్లో డిజైన్‌ను సెట్‌చేసి మిషన్‌పై చెక్కలు బిగించాడు. కంప్యూటర్ చెక్కలపై డిజైన్ పని చేసుకుంటుండగా ఈలోపు భోజనం చేసి వద్దామని బయటకు వెళ్లాడు. కొంతసేపటి తరువాత తిరిగి వచ్చే చూసేసరికి అప్పటికే రెండు సీఎన్‌సీ మిషన్లు, చుట్టూ ఉన్న కలపకు మంటలు వ్యాపించాయి. వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక కేంద్రానికి, తన సిబ్బందికి, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే షెడ్డులో దట్టమైన పొగ అలముకుని మంటలు వ్యాపించటంతో అదుపుచేయటం కష్టంగా మారింది. ఈలోపు అందినకాడికి కలపను పక్కకు లాగారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని అంచనా వేశారు.
పూర్తిగా దగ్ధం..
మిషన్లు, ఫర్నీచర్ కోసం ఉపయోగించే కలప చెక్కలు, కంప్యూటర్లు కాలిపోయాయి. అప్పటికే డిజైన్ పూర్తయి డెలివరీకి సిద్ధంగా ఉన్న కలప కూడా దగ్ధమైంది. సుమారు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఉన్నదంతా ప్రమాదంలో కాలిపోయిందని మరలా మిషన్లు ఎలా కొనుక్కోవాలో... ఆర్డర్లు ఇచ్చిన వారికి తిరిగి కలప ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలో పాలుపోవటంలేదని యజమాని అద్దంకి సత్యనారాయణ వాపోతున్నారు.


