చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం స్థానిక జెడ్పీ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెయిట్ లిఫ్టర్ శిరోమణి, కయాకింగ్ జల క్రీడాకారిణి నాగిడి గాయత్రి, జిల్లాలోని పలువురు మహిళా వ్యాపారవేత్తలు వారి అనుభవాలను వివరించారు. ఆయా రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మెగా చెక్కులు పంపిణీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారవేత్తగా ఎదగాలనే కోరిక, తపన కలిగి ఉండటం విజయానికి తొలిమెట్టన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని, పట్టుదల, కృషితో విజయం పొందుతారన్నారు. ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు మాట్లాడుతూ సమాజంలో మహిళ లు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఆర్థిక స్వాతంత్య్రం పొందుతూ సాధికారిత సాధిస్తున్నారన్నారు. అదే సమయంలో సైబర్ నేరాలు, గృహహింస, భద్రత సమస్యలను ఎదుర్కొంటున్నారని దీనికి చట్టాల అమలు, సామాజిక మార్పు ద్వారా పూర్తి రక్షణ, సమాన అవకాశాలు కల్పిస్తారన్నారు. అనంతరం బాలబాలికల సంరక్షణ, చట్టాలపై సమగ్ర అవగాహనకు చైతన్యం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ శాఖల, మహిళా వ్యాపారవేత్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు వై.హరిహరనాథ్, ఎంఎన్ రాణి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల భాగస్వామ్యంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జెడ్పీ సమావేశపు హాలులో ఆదివారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. వీటిని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసి వారి ఉన్నతికి తోడ్పాటును అందించారన్నారు. తాను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సమర్థంగా నిర్వహించామంటే అది వైఎస్ జగన్ నాకిచ్చిన గౌరవమేనన్నారు. జెడ్పీ సభ్యులుగా ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్ హారికను సభ్యులందరూ గజమాల, పూలకిరీటంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలకపాత్ర..
తొలి మెట్టు అదే..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక