గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మహిళలు సాధికారత సాధించినప్పుడే సమగ్ర ప్రగతికి పునాది అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘రైజ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మహిళా దినోత్సవంలో 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలు అందిస్తూ స్వావలంబన దిశగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్: 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడారు. అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలను సత్కరించారు.
చెక్కులు అందజేత..
డీఆర్‌డీఏ ద్వారా 4,646 మంది స్వయం సహాయక సంఘ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.83.78 కోట్లు, 6,146 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.829.55 కోట్లు, సీ్త్రనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద 18,550 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.138.41 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (వర్సున్నపేట)కు ట్రాక్టర్ అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దే అనురాధ, మున్సిపల్ చైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జోత్స్న అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


