కోడూరు: రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కోడూరు మండలంలోని స్వతంత్రపురం పీహెచ్‌సీ సమీపంలోని ఖాళీ స్థలంలో స్థానిక వ్యాపారి పసుపులేటి రాము ఆధ్వర్యాన పోటీలకు శ్రీకారం చుట్టారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్‌ఐ చాణిక్య పోటీలను ప్రారంభించారు. వారు నిర్వాహకుడు రామును శాలువాతో సత్కరించారు. అనంతరం పోటీకి వచ్చిన ఎడ్ల జట్ల యజమానులతో మాట్లాడారు.
పోటీల్లో 22 ఎడ్ల జతలు..
తొలి రోజు ఆదివారం వ్యవసాయ విభాగానికి సంబంధించిన ఎడ్ల జతలకు పోటీలను నిర్వహించారు. బాపట్ల, చీరాల, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 22 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సోమవారం న్యూ జూనియర్ విభాగానికి చెందిన ఎడ్ల జతలకు పోటీలు ఉంటాయని, వీటిలో గెలుపొందిన జతలకు నగదు బహుమతులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.


