28న తిరుపతమ్మ పెనుగంచిప్రోలుకు పయనం
జగ్గయ్యపేట: తిరుపతమ్మవారు ఈ నెల 28న పెనుగంచిప్రోలుకు పయనం కానున్నారు. రెండేళ్లకోసారి పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారు రంగుల మహోత్సవానికి జగ్గయ్యపేటకు రావడం ఆచారంగా వస్తోంది. ఈ నెల 5న బయలుదేరి 6వ తేదీ పట్టణంలోని రంగుల మండపం వద్దకు చేరుకున్నారు. దాదాపు 24 రోజుల పాటు రంగుల మహోత్సవం పూర్తి చేసుకుని పెనుగంచిప్రోలుకు పయనం కానున్నారు. గోపయ్య సమేత తిరుపతమ్మవారు, సహదేవతలు రంగుల మండపం వద్దకు వచ్చారు. ఈ నెల 28న బుధవారం ఉదయం 6గంటలకు మండపం నుంచి ప్రత్యేక పల్లకీల్లో పయనం కానున్నారు. 29వ తేదీ సాయంత్రం 6గంటలకు బయలుదేరి రాత్రి 10గంటలకు పెనుగంచిప్రోలులోని పాత సినిమాహాల్ సెంటర్ సమీపంలోని అమ్మవారి మండపం వద్దకు విగ్రహాలు చేరుకుంటాయి. అక్కడ కుంభపూజ అనంతరం విగ్రహాలకు కళ్లగంతలు తొలగించి ప్రత్యేక రథంపై అమ్మవారి 30వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుంటారు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన రజకులు 8 ప్రత్యేక పల్లకీలను సిద్ధం చేశారు.


