‘ప్రైవేట్’ నిర్లక్ష్యం
నిబంధనలు పాటించని ట్రావెల్స్
లాభాపేక్షే అజెండా
పండుగ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 19 వరకూ ప్రత్యేక తనిఖీలు
దాడుల్లో అనేక లోపాలు గుర్తించిన ఆర్టీఏ అధికారులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రయాణికులకు కష్టాలు కొనితెస్తున్నాయి. నిబంధనలు పాటించక కాసుల కోసం బస్సులను వాయువేగంతో పరుగులు తీయిస్తూ ప్రజల ప్రాణాలను బలిపెడుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో లోపాలను గుర్తించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడమే. ఇటీవల వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా వారికి నిబంధనలు పట్టడం లేదు. రవాణా అధికారులు హెచ్చరిస్తున్నా ‘ప్రైవేట్’ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల ప్రత్యేక తనిఖీలు
సంక్రాంతి ప్రయాణాల నేపథ్యంలో ట్రావెల్స్ నిర్వాహకులు అత్యధిక రేట్లు వసూలు చేయకుండా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఎన్టీఆర్ జిల్లా అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఈ నెల 8 నుంచి 19 వరకూ తనిఖీలు చేశారు. వీటిలో అధిక చార్జీలు వసూలు చేయడం, అనేక భద్రతా లోపాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. 12 రోజుల పాటు నిర్వహించిన తనిఖీలో 226 కేసులు నమోదు చేసి, రూ. 9,32,950 జరిమానాలు విధించారు. ఇవే తప్పులు మళ్లీ చేస్తే మరింత కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గుర్తించిన లోపాలు ఇవే
అధికారులు చేసిన తనిఖీల్లో పలు భద్రతాపరమైన లోపాలను గుర్తించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలను ఆర్పేందుకు సిలెండర్‌లు కూడా లేని వైనాన్ని గుర్తించారు. చిన్న చిన్న గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స చేసేలా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. వాటిని కూడా కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌ట్రా హెడ్‌లైట్‌లు, ఎక్స్‌ట్రా హారన్స్ ఏర్పాటు చేయడం, కనిపించని విధంగా నంబర్ ప్లేట్స్ ఉండటం వంటి అనేక లోపాలు గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు, జరిమానాలు విఽధించారు. వీటితో పాటు అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులకు ఎక్కువ జరిమానాలు వేశారు.
భద్రత పట్టని ట్రావెల్స్
ఇటీవల కాలంలో తరచూ బస్సు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడటం చూస్తున్నాం. అయినా ట్రావెల్స్ మితిమీరిన వేగంతో నడుపుతూనే ఉన్నారు. తక్కువ సమయంలో బెంగళూరు తీసుకెళ్తాం.. హైదరాబాద్ వెళ్తాం అంటూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఆ క్రమంలో భద్రతను పట్టించుకోవడం లేదు. ఎక్స్‌ట్రా హెడ్‌లైట్స్ కారణంగా ఎదురుగా వచ్చే వారికి కనిపించని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రమాదాల బారిన పడవచ్చు. ఇలా అనేక లోపాలతో ట్రావెల్స్ యజమానులు బస్సులను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రవాణా వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తాం. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి బస్సులో ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఇటీవల తనిఖీల్లో ఇలాంటి లోపాలను కూడా గుర్తించాం.
–ప్రవీణ్, ఆర్టీఓ, ఎన్టీఆర్ జిల్లా
‘ప్రైవేట్’ నిర్లక్ష్యం


