ఉచిత పథకాలకు వ్యతిరేకం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెనమలూరు: ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని పేదలకు మాత్రమే అమలుచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పెనమలూరు మండలం కానూరులోని పెద్దల ఆశ్రమంలో (సీనియర్ సిటిజన్స్ ఫోరం) ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా ఉన్న వారికి ఉచి త పథకాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలను గుర్తించి ఉచిత పథకాలు ఇవ్వాలని సూచించారు. విజయవాడలో పెద్దపెద్ద వైద్యులు ఉన్నారని, వారు కొంత సమయం వెచ్చించి పెద్దల ఆశ్రమాల్లో ఉండే పెద్దలకు సేవలు అందించాలని కోరారు. పెద్దల ఆశ్రమానికి తన వంతుగా రూ.2 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు. పెద్దల ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.
టీడీపీ నేతలు
రామవరప్పాడు: రామవరప్పాడు పంచాయతీ నిధులు సుమారు రూ.4 కోట్లను గోల్‌మాల్ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకే చెందిన గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అడ్డుకోవడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం స్థానిక నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ అధ్యక్షుడు నభిగాని కొండ మాట్లాడుతూ పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయని అందిన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేసి సుమారు రూ. 4 కోట్లు పైగా దుర్వినియోగమైనట్లు గుర్తించారన్నారు. మాజీ పంచాయతీ కార్యదర్శి ఘంటా రామ్మోహనరావు, సర్పంచ్ వరి శ్రీదేవి, నాడు ప్రత్యేకాధికారులుగా ఉన్న ఎంపీడీవో జె.సునీత, ఇరిగేషన్ ఏఈ కొండలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారన్నారు. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన వీరికి మంత్రి పార్థసారథి అండదండలు ఉన్నాయన్నారు. ఆయన అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఉపసర్పంచ్ అద్దెపల్లి సాంబశివనాగరాజు మాట్లాడుతూ దుర్వినియోగమైన సొమ్మును ప్రత్యేకాధికారులుగా పని చేసిన ఇరిగేషన్ ఏఈ కొండ, అప్పటి రూరల్ ఎంపీడీవో సునీత, సర్పంచ్ వరి శ్రీదేవిలు రూ.2,02,16,000, కార్యదర్శి ఘంటా రామ్మోహనరావు రూ.2,02,16,180 చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారులు నోటీసులో పేర్కొన్నారన్నారు. ఇప్పటి వరకూ ఈ నిధుల రికవరీ జరగలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికై నై అధికారులు స్పందించి వెంటనే నిధులు రికవరీ చేసి గ్రామాభివృద్ధికి వినియోగించాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వార్డు సభ్యులు కొంగన రవి, నాయకులు సూర్యకుమారి, సత్యనారాయణ, రామకృష్ణరాజు పాల్గొన్నారు.
ఉచిత పథకాలకు వ్యతిరేకం


