బాధితులకు జననేత భరోసా
జోజినగర్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్ జగన్ 42 ప్లాట్ల కుటుంబాలను పరామర్శించిన వైఎస్సార్ సీపీ అధినేత గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడి తోడుగా ఉంటానని హామీ తమ ఆవేదనను వినడానికి జననేతరావటంపై బాధిత కుటుంబాల హర్షం చంద్రబాబు ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని బాధితుల ఆగ్రహం అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలివచ్చిన జన సందోహం జై జగన్ అన్న నినాదాలతో మారుమోగిన జోజినగర్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ‘నేనున్నా.. మీకు తోడుగా ఉంటా’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యం నింపింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి, ప్రభుత్వ ఆదరణకు నోచుకోని బాధితులు జననేత ఆత్మీయ పరామర్శతో సాంత్వన పొందారు. బెజవాడ జోజినగర్‌లో చంద్ర బాబు ప్రభుత్వం అండతో 42 ప్లాట్లలో ఇటీవల అక్రమంగా కూల్చివేతకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జోజినగర్ చేరుకున్న జననేతకు బాధితులు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వినిపించారు. రెక్కల కష్టంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని పాతికేళ్లుగా నివ సిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్లాట్లు తమవి కావంటూ తమ ఇళ్లను ఒక్కసారిగా బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డుపాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
గంటకు పైగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగన్‌మోహన్‌రెడ్డి
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి సుమారు గంటకు పైగా ఆయా కుటుంబాలను ఓదార్చారు. ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకున్నారు. స్థలాలను ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎంతకు కొన్నారు, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ తీసుకున్న తీరును, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జోజినగర్ 42 ప్లాట్ల ప్రాంతానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆయా బాధిత కుటుంబాలు ఉన్న టెంట్‌లోకి వెళ్లి వారితో పాటు కూర్చుని వారి బాధలను ఓపికగా ఆలకించారు.
ప్రభుత్వంపై బాధితుల ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి పోలీసు సిబ్బందితో తమను రోడ్డుపాలు చేసిందంటూ బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము దశా బ్దాల క్రితం కష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, అన్ని అనుమతులతో నిర్మించుకుని పాతికేళ్లుగా నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వం దగ్గరుండి కూల్చివేసి మోసగాళ్లకు కొమ్ముకాసిందని జగన్ వద్ద వాపోయాయి. తమ స్థలాలకు పన్నులు కట్టించుకుంటూ, ఇంటి నిర్మాణానికి ప్లాన్‌లతో ఆమోదం తెలిపి, విద్యుత్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థలాలను ఎవరో వస్తే వారికి అండగా నిలిచి దోచి పెట్టిందని బాధితులు విలపించారు.
జననేత కోసం తరలివచ్చిన జనసందోహం
జోజినగర్‌కు వచ్చిన తమ అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడటానికి, కలిసి మాట్లాడటానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జోజినగర్ పరిసరాలు మారుమోగాయి. భారీ జన సందోహం కారణంగా కారు దిగిన జగన్‌మోహన్‌రెడ్డి పక్కనే బాధిత కుటుంబాలు ఉన్న టెంట్ వద్దకు చేరుకోవడానికి 15 నిమిషాలకు పైగా సమయం పట్టింది.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, రాష్ట్ర కార్యదర్శి గౌస్ మొహిద్దీన్, జోగి రాజీవ్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వీఎంసీ ఫ్లోర్‌లీడర్ అరవ సత్యనారాయణ, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, కోటిరెడ్డి, షేక్ రెహమతున్నీసా, బండి నాగేంద్ర పుణ్యశీల, గోదావరి గంగ, శిరంశెట్టి పూర్ణ, సహాయ కార్యదర్శి షేక్ హాయత్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు జననేత భరోసా
బాధితులకు జననేత భరోసా


