రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను సమకూర్చి సహకరించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ రైస్‌మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధికంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్లు వరికోతలు కోయటంతో ఎక్కువగా ఒకేసారి ధాన్యాన్ని సేకరించాల్సి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గోనె సంచులు, వాహనాలను సమకూర్చినప్పటికీ సరిపోవటం లేదని చెప్పారు. మిల్లర్లు వారి వద్ద ఉన్న గోనె సంచులు, వాహనాలను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమకూర్చాలన్నారు.
75 శాతం కోతలు పూర్తి..
జిల్లాలో ఇప్పటికే 75 శాతం వరికోతలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. ఆ ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే బ్యాంక్ గ్యారెంటీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని తీసుకువస్తున్నారని దానిని ఆరబెట్టేందుకు వీలుగా మిల్లర్ల వద్ద ఉన్న డ్రయర్లను వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు 1318 రకం వరిని పండిస్తున్నారని ఆ ధాన్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. జిల్లాకు మరో 10 లక్షల గోనె సంచులను త్వరలో తీసుకువస్తున్నామని తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.


