డిజిటల్ పాలనలో కృష్ణాజిల్లా ప్రథమస్థానం
చిలకలపూడి(మచిలీపట్నం): డిజిటల్ పాలనలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటిస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఈ–ఆఫీస్‌లో మొదటి స్థానంలో నిలిచినందుకు ఆయనను గురువారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఘనంగా సత్కరించారు. జేసీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు ఈ–ఆఫీస్‌లో 1482 ఫైల్స్ రాగా అందులో 1469 ఫైల్స్ వేగవంతంగా క్లియర్ చేసినందుకు ఆయనకు మొదటిస్థానం లభించిందన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–ఆఫీస్‌లో ఫైళ్లను క్లియర్ చేయటంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కూడా మూడో స్థానంలో నిలిచినందుకు ఆయన్ను అభినందించారు. జిల్లా అధికారులు కూడా వారి పరిధిలో ఫైల్స్ పరిష్కారంలో ఏ మేరకు శ్రద్ధ కనపరుస్తారో పరిశీలించి జిల్లాలో కూడా అధికారులకు ర్యాంకులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఇన్‌చార్జ్ డీఆర్వో శ్రీదేవి పలువురు అధికారులు పాల్గొన్నారు.


