తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టండి
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గురువారం తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ మిషన్ నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో మంజూరైన 956 మరుగుదొడ్ల పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సామాజిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 18 అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మంజూరైన 148 మరుగుదొడ్లు, తాగునీటి పనులు 131 పూర్తి చేశారని మిగిలిన పనులు కూడా సత్వరమే చేపట్టాలని కోరారు. గ్రామాల్లోని అన్ని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఏలూరు కాలువ పరిధిలో విజయవాడ నుంచి బుడమేరు వరద ముంపు జరగకుండా కాలువల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. గన్నవరం, నందివాడ, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పరిధిలో అన్ని చెరువులను నూరుశాతం నింపుకోవాలని తెలిపారు. అవసరమైతే అదనపు బోర్లను కూడా వేయాలన్నారు. మురుగుకాలువల నిర్మాణంలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


