ఉత్సాహంగా యువజనోత్సవం
పా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయం కృష్ణతరంగ్–2025 పేరుతో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల యువజనత్సోవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన యువజనోత్సవాలు రెండో రోజు శుక్రవారం విద్యార్థులు కళాప్రదర్శనలతో సర్వత్రా ఆకట్టుకున్నాయి. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వివిధ వేదికలపై ఈ పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా యువజనోత్సవాల పోటీల్లో వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు తమ ప్రతిభతో అలరించారు. ఏకాంకికలు, జానపద బృంద నాట్యాలు, క్రియేటివ్ కొరియోగ్రఫీ, లలితసంగీతం, రంగోలి తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన ప్రదర్శనలు..
వివిధ సామాజికాంశాలతో రూపొందించిన కళారూపాలు అలరించటమే కాకుండా ఆలోచింపజేశాయి. ప్రధానంగా సమాజంలో మనుషులను మనుషులే చంపుతుంటే తోటివారు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థులు మానవ సమాజంలో ఉన్న రుగ్మతలను తమ ప్రదర్శనలతో ఎత్తి చూపారు. అలాగే దేశభక్తి ప్రబోధంగా సాగిన నృత్యాలు, ఇతర ప్రదర్శనలు అలరించాయి. వాటితో పాటుగా తెలుగునాట ఉన్న పలు జానపద కళారూపాలను సైతం విద్యార్థులు అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. వాటితో పాటుగా లలిత సంగీతం, రంగోలి తదితర అంశాల్లోనూ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, విద్యాసంస్థల్లో సెల్‌ఫోన్‌ల వినియోగం వంటి అంశాలపై వక్తృత్వం, డిబేట్ పోటీలను నిర్వహించారు.
ఉత్సాహంగా యువజనోత్సవం


