దోచుకోవడం.. దాచుకోవడం పైనే టీడీపీ దృష్టి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి దోచుకోవడం, దాచుకోవడంపైనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి అరకొరగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం గుణదలలో పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ జరుగుతోందన్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 13తో ముగుస్తోందని, ఆరోజు పార్టీ కార్యాలయంలో సంతకాల ప్రతులు అందజేస్తామన్నారు. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలు గవర్నర్‌కి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు..
జనవరి నాటికి అన్ని మండల్లాలో కమిటీలు పూర్తి చేయాలని దేవినేని అవినాష్ సూచించారు. ప్రతి సభ్యుడికి పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా, నియోజకవర్గాల పర్యటన త్వరలో ఉందని, ప్రతి కార్యకర్తను ఆయన కలుస్తారన్నారు.
ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి..
మాజీ శాసన సభ్యుడు, తిరువూరు పార్టీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలలు ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.
సినిమా షూటింగ్‌లా రాజకీయాలు..
పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లాగా రాజకీయాలు చేస్తున్నారని పార్టీ పశ్చిమ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు క్లాప్ కొట్టగానే నటన ప్రారంభిస్తున్నారన్నారు. ఏడు నియోజకవర్గాలో పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకుడు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
కార్యవర్గ సమావేశంలో దేవినేని అవినాష్


