నేటి నుంచి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్
గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా విభాగాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–14, 17 బాలుర, బాలికల జట్ల ఎంపికలు ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ కృష్ణాజిల్లా సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 4న గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో చెస్, అథ్లెటిక్స్ సెలక్షన్స్, 5న గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో యోగా సెలక్షన్స్, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఖోఖో సెలక్షన్స్ జరుగుతాయన్నారు. 6న గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్‌బాల్, బేస్ బాల్ సెలక్షన్స్, 7న గూడూరు జెడ్పీ హైస్కూల్‌లో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తామని అరుణ చెప్పారు.
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని, వ్యాప్తి కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. మచిలీపట్నం ఏఆర్టీ సెంటర్ ఆధునికీకరించామన్నారు. గుడివాడ ఏఆర్టీ సెంటర్‌కు సౌకర్యాల లోపం ఉందని అధికారులు వివరించగా, సీఎస్‌ఆర్ నిధులతో భవనం ఏర్పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 7,085 మంది హెచ్‌ఐవీ బాధితులు ఏఆర్టీ సెంటర్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శేషుకుమార్ పాల్గొన్నారు.


