యువజనోత్సవాల్లో విజేతలకు బహుమతి ప్రదానం
గుడ్లవల్లేరు: విద్యతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శనలు అవసరమని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఓ.మధు భూషణం అన్నారు.
ఏపీ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ స్టెప్ క్రిషి వారు 2025 జిల్లా స్థాయి యువజనోత్సవాలను మంగళవారం గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎంఅండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఓ.మధు భూషణం మాట్లాడుతూ యువజనోత్సవాల ద్వారా యువతలో దాగి ఉన్న కళా నైపుణ్యం వెల్లడవుతుందని అన్నారు. జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని, రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన విజేతలు జనవరిలో న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి యువజనోత్సవాలలో జిల్లాకు చెందిన పలు కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. యువజనోత్సవాల ముగింపు సందర్భంగా పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్, యూత్ ఆఫీసర్ సుంకర రాము, జిల్లా ఎన్.ఎస్.ఎస్ అధికారి కె.రమేష్, డిస్ట్రిక్ట్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.


