టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి

Nov 5 2025 8:42 AM | Updated on Nov 5 2025 8:42 AM

టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి

టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి

టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సులకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్‌బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్‌లు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో బస్సులు నడిపే వారి వలన టూరిస్ట్‌ బస్సు ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాహన సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సవరించాలని కోరారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనేష్‌బాబు మాట్లాడుతూ టూరిస్ట్‌ బస్సు ఆపరేటర్లు ప్రతి ఏడాది రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్మిట్‌లు తీసుకొని సంవత్సరానికి రూ.50 వేల టాక్స్‌ చెల్లించి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా టాక్స్‌ కట్టకుండా స్టేట్‌ క్యారేజ్‌ నిర్వహిస్తూ ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్‌ ఆపరేటర్ల వ్యాపారాన్ని గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మురళీమోహన్‌, కార్యదర్శి కె.శివరాం మాట్లాడుతూ టూరిస్ట్‌ బస్సు ఆపరేటర్లు ఏ విధమైన నియమ నిబంధనలు అతిక్రమించడం లేదన్నారు. గ్రీన్‌ టాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆరు నెలల క్రితం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ను కలిసి విన్నవించినా, ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు అశ్విన్‌రెడ్డి, సత్యప్రసాద్‌, వేములపల్లి వెంకటేశ్వర్లు, కేతన సాయి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బ అనేష్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement