సమష్టి కృషితో తుపానును ఎదుర్కొన్నాం
●కృష్ణా కలెక్టర్ బాలాజీ
●కోడూరు మండలంలో
5వేల మందికి పునరావాసం
●ఎలాంటి ప్రాణ, జంతునష్టాలు లేవు
కోడూరు: ‘మోంథీ’ తుపాను ను జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషితో ఎదుర్కొన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కోడూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మండలాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించారు. సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం మండలాలపై తుపాను ప్రభావం అధికంగా కనిపించిందని కలెక్టర్ తెలిపారు. కోడూరు, వి.కొత్తపాలెం జెడ్పీ పాఠశాలలు, తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐదు పునరావాస కేంద్రాల ద్వారా రెండు రోజుల పాటు ఐదు వేల మందికి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. కేంద్రాల్లో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని వసతులు సమకూర్చారని, ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదు పాయాన్ని సమకూర్చినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాన్ వల్ల తీరప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ, జంతు నష్టాలు జరగలేదని ప్రకటించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను సమయంలో సమన్వయంతో పని చేసిన పంచాయతీరాజ్, రెవెన్యూ, సచివాలయ, విద్యుత్, వైద్య శాఖల అధికారులను కలెక్టర్ ప్రశంసించారు. ప్రత్యేకాధికారి ఫణి, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, ఎంపీడీఓ సుధాప్రవీణ్, ఎంఈఓ టి.వి.ఎం.రామదాసు, ఈఓపీఆర్డీ నాగరేవతి పాల్గొన్నారు.


