తుపాను దెబ్బతో కూరగాయల కొరత
● రైతుబజార్లలో అరకొరగా లభ్యం
● ఉన్నవేమో ధరల మంట
●ఉసూరుమంటూ వెనుతిరుగుతున్న వినియోగదారులు
పాయకాపురం(విజయవాడరూరల్): మోంథా తుపాను కారణంగా విజయవాడ నగరంలోని రైతుబజార్లలో కూరగాయల కొరత ఏర్పడింది. రైతుబజార్లకు రావాల్సిన కూరగాయలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు పండించే ప్రాంతాల నుంచి వర్షం దెబ్బకు కూరగాయలు రాకపోవడంతో రైతుబజార్లలో అరకొరగా ఒకటి, రెండు రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కూరగాయల కొనుగోలు కోసం వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుతిరిగి వెడుతున్నారు. పాయకాపురం, అజిత్ సింగ్‌నగర్ రైతు బజార్లలో మోంథా తుపాను వలన కూరగాయలకు కొరత ఏర్పడింది. టమోటాలు, కూర అరటి కాయలు, మునగ తప్ప చెప్పుకోదగిన కూరగాయలు లభించక కొనుగోలుదారులు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెడుతున్నారు.గుంటూరు జిల్లా కుంచనపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఆకు కూరలు కూడా అరకొరగా రావడం, ధరలు అమాంతం పెంచి అమ్మడంతో ధరల మంట మండిస్తున్నారంటూ వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. టమోట కిలో రూ.38, దొండ కిలో రూ.50, దోసకాయలు కిలో రూ.25, కాకరకాయ పావుకిలో రూ.30, క్యారెట్ కిలో రూ.75 చొప్పున అమ్ముతున్నారు. ఆకు కూరల విషయానికి వస్తే తోటకూర కట్ట 30 రూపాయలు, పాలకూర 25 రూపాయలు అమ్ముతున్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే ఏం కొంటాం, ఏం తింటామని వినియోగదారులు వాపోతున్నారు. పాయకాపురం రైతు బజార్లో కూరగాయలు స్టాకు సరిపడా లేకపోవడంతో కొన్ని దుకాణాలు మూతవేసి ఉండటం కనిపించింది. మోంథా తుపాను వల్ల కూరగాయలు తక్కువగా వస్తున్నాయని ఎస్టేట్ అధికారి కిరణ్ తెలియజేశారు. నూజివీడు, ఆగిరిపల్లి, నున్న, మోరంపూడి, కుంచనపల్లి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల నుంచి కూరగాయలు రావడం లేదన్నారు. రైతుబజార్లకు దుకాణదారులు వచ్చి పెద్ద మొత్తంలో కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో గృహ వినియోగదార్లకు అరకొరగా ఉన్న కూరగాయలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం లోని అన్ని రైతుబజార్లకు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయలను సరసమైన ధరలకు సరఫరా చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని గృహ వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తుపాను దెబ్బతో కూరగాయల కొరత


