రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు

Oct 30 2025 10:13 AM | Updated on Oct 30 2025 10:13 AM

రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు

రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు

రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు 11 రకాల రిజర్వేషన్లతో చేనేతలకు రక్షణ రైతులు జాగ్రత్తలు పాటించాలి

వాన నీటి పంపుహౌస్‌ను పరిశీలించిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. విజయవాడ లోబ్రిడ్జ్‌ ప్రాంతంలోని వాననీటి పంపు హౌస్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. పంపు హౌస్‌ పనితీరును మునిసిపల్‌ ఇంజినీర్లు మంత్రికి వివరించారు. పంపుహౌస్‌లో ఎనిమిది మోటార్ల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో తోడినట్లు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాయన్నారు. నీరు నిలిచిపోతే అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశముందని, అందువల్ల ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని, ఆ సన్నద్ధత కారణంగానే తుపానును సమర్థంగా ఎదుర్కొని, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించగలిగామని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, లోతట్టు ప్రాంతాలు, తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి ఏ సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించగలిగేలా చూశామన్నారు. బుడవేురు, ప్రకాశం బ్యారేజీలలో ఇన్‌ఫ్లో తక్కువగానే ఉందన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పాము కాటు మందు సహా, అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచామన్నారు. ఆయన వెంట వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర తదితరులు ఉన్నారు.

మంగళగిరి టౌన్‌: చేనేతల రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలుచేయాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని ఆయన కార్యాలయం నుంచి బుధవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు జరుపుతానని చెప్పి 14 నెలలు గడిచినా నేటికీ అమలుచేయలేదన్నారు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 25 వేలు తక్షణమే అమలు చేయాలని కోరారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మోంథా తుపాను కారణంగా జీవనం కోల్పోయిన చేనేత కార్మికులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్‌ 7న రాష్ట్రంలో ఏడీ కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని, వాటిలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

పెడన:మోంథా తుపాను గాలుల ప్రభావంతో వరిచేలు నేలరాలిన పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పెడన ఏవో ఎస్‌ జెన్నీ సూచించారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించారు. నేల రాలిన పంటల రైతులను కలిసి వారికి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పొలంలో నీరుంటే చిన్న చిన్న పాటి దారులు ఏర్పాటు చేసి ఆ నీరంతా బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. పడిపోయిన వరికంకులను నిలబెట్టి కట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement