వరిగిన ఆశలు
మోంథా.. కన్నీటి వ్యథ
భారీ గాలులకు చిగురుటాకులా వణికిన కృష్ణా జిల్లా జిల్లాలో 1,15,892.5 ఎకరాల్లో దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటలు 1,12,601.3 ఎకరాల్లో వరి పంటకు వాటిల్లిన నష్టం తుపాను శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా ప్రజలు కొనసాగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు సెల్‌టవర్లు పనిచేయక మూగనోము పట్టిన ఫోనులు
కంద కుళ్లే ప్రమాదం
పంట నష్టం ప్రాథమిక అంచనాలు ఇలా...
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను భారీ వర్షాలు, ఈదురు గాలలతో కృష్ణా జిల్లాను వణికించింది. ముఖ్యంగా లక్ష ఎకరాలకు పైగా వరి పంటను దెబ్బతీసి రైతులకు కన్నీరు మిగిల్చింది. బొప్పాయి, అరటి, కూరగాయ పంటలను తుడిచిపెట్టి ఉద్యాన రైతుల కష్టం కలిగించింది. తీరం వెంబడి వీచిన భారీ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 119 సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో అంధకారం నెలకొంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 214 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 21,525 మందికి రక్షణ కల్పించారు.
అన్నదాతకు గుండెకోత
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా ఆ తరువాత మోంథా పెను తుపానుగా మారి జిల్లాపై విరుచుకుపడింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షం, ఈదురు గాలులకు చిరుపొట్ట నుంచి, గింజ గట్టి పడే దశలో, కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నేలవాలాయి. పైరు మీదుగా వర్షపునీరు ప్రవహిస్తుండటంతో చిరు పొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్న పొలాల్లో తాలు, తప్ప గింజలు ఏర్పడతాయని, మానుగాయ వచ్చి దిగుబడులు, నాణ్యత దిగజారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టబడులు పెట్టామని, మరో 20 రోజుల్లో కోతలు చేపట్టాల్సిన తరుణంలో తుపాను తమ కష్టాన్ని కన్నీటిపాలు చేసిందని వాపోయారు.
నియోజకవర్గాల వారీగా నష్టం ఇలా..
మోంథా తుపానుతో కంద పంట మొత్తం నీటమునిగింది. పుట్టు విత్తనం రూ.7 వేల చొప్పున కొని ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు వెచ్చించి సాగుచేపట్టా. ప్రస్తుతం కంద తోటలో నీరు నిలిచింది. దీని వల్ల దుంప పెరుగుదల నిలిచిపోతుంది. ఎక్కువ రోజులు నీరు నిలిస్తే దుంప పూర్తిగా కుల్లిపోతుంది. పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తుంది.
– కోసూరు వెంకటేశ్వరావు, కోసూరువారిపాలెం, కృష్ణాజిల్లా
జిల్లాలో 24 మండలాల పరిధిలోని 427 గ్రామాల్లో 5,6050 మంది రైతులకు సంబంధించి 1,15,892.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 54,180 మంది రైతులు సాగుచేసిన వరి 1,12,601.3 ఎకరాల్లో నేలవాలి దెబ్బతింది. 720.5 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిని 566 మంది రైతులు నష్టపోయారు. 2462.5 ఎకరాల్లో మినుము దెబ్బతిని 1,249 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు సంబంధించి 2,229 మంది రైతులు 1397.2 ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిని రూ.73.45 కోట్ల నష్టం వాటిల్లింది. 119 సబ్‌స్టేషన్లు, 52 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు 471, 33 కేవీ స్తంభాలు 93, 11 కేవీ స్తంభాలు 353 దెబ్బతిని రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 506 చెట్లు నేలకూలాయి. ఒక గెదే, మరో దూడ చనిపోయాయి. బుధవారం సాయంత్రానికి సైతం కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నోచుకోలేదు. అవనిగడ్డ నియోజకవర్గంలో సెల్ టవర్లు పనిచేయలేదు. దీంతో మంగళవారం ఫోన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరిగిన ఆశలు
వరిగిన ఆశలు


