డ్రోన్‌తో తుపాను నష్టం అంచనాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలతో పాటు రోడ్లు, వంతెనలు, ఇళ్లు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితంగా, అత్యంత పారదర్శకంగా అంచనా వేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)లో కలెక్టర్ లక్ష్మీశ తుపాను నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా తొలిగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రజలకు వీలైనంత త్వరగా సహాయసహకారాలు అందించేందుకు నష్టాలను సత్వరం అంచనా వేసేలా ఆధునిక సాంకేతికత దోహదం చేస్తోందన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో నష్టాల అంచనాలకుగాను ఒక్కో మండలానికి ఒక డ్రోన్ సర్వే టీమ్ పనిచేస్తోందని వివ రించారు. సంప్రదాయ పద్ధతులతో పోల్చితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో డ్రోన్ సాంకేతికత ద్వారా కచ్చితమైన ఆధారాలతో నష్టాలను అంచనా వేయొచ్చన్నారు. హై రిజల్యూషన్ ఇమేజరీ, పుటేజీ ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. మనుషులు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోకి సైతం డ్రోన్లను పంపి.. అక్కడి పరిస్థితిని తెలుసుకొని నష్టాన్ని విశ్లేషించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ మ్యాపులు, ఫొటోలు, 3డీ నమూనాల రూపంలోనూ పంట నష్టం నివేదికలను రూపొందించి పారదర్శకతను పెంపొందించవచ్చన్నారు.
పునరుద్ధరణ పనులకూ దోహదం..
డ్రోన్ సాంకేతికత ద్వారా సేకరించిన డేటా ఆధారంగా పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను సైతం సత్వరం చేపట్టేందుకు వీలుంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని త్వరగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


