పునరావాస కేంద్రంలో మహిళకు పాము కాటు
చల్లపల్లి: తుపాను పునరావాస కేంద్రాల్లో బాధితులకు రక్షణ కరువైంది. ఇద్దరు పిల్లలతో కేంద్రానికి వెళ్లిన తల్లి పాముకాటు బారినపడి ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రంలో జరిగింది. తుపాను నేపథ్యంలో మంగళవారం రాత్రి వక్కలగడ్డ గ్రామానికి చెందిన కట్టా లక్ష్మీతిరుప తమ్మ తన భర్త నాగరాజు, కుమార్తె సత్యఅక్షర, కుమారుడు జోఅఖిలానంద్‌తో కలిసి పునరా వాస కేంద్రానికి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కుమార్తె సత్యఅక్షరను మరుగుదొడ్డికి తీసుకెళ్తున్న క్రమంతో లక్ష్మీతిరుపతమ్మ కాలిపై కట్లపాము కాటువేసింది. అనంతరం దానిని పునరావాస కేంద్రంలో ఉన్నవారు చంపేశారు. పునరావాస కేంద్రంలోని సచివాలయ సిబ్బంది 108కు కాల్‌చేసి బాధితురాలిని చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుపతమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అదే పునరావాస కేంద్రంలోని వంట గదిలో బుధవారం ఉదయం మరో కట్లపాము కంటపడటంతో అక్కడ ఆశ్రయం పొందిన వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో 35 మి.మీ. వర్షపాతం నమోదు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో బుధవారం 35.0 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగాయలంక మండలంలో 80.4, అత్యల్పంగా గూడూరు మండ లంలో 9.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. మండలాల వారీగా కోడూరులో 65.8 మిల్లీమీటర్లు, అవనిగడ్డ 61.6, పెనమలూరు 58.6, కంకి పాడు 55.4, తోట్లవల్లూరు 44.6, మోపిదేవి 40.8, గన్నవరం 39.4, చల్లపల్లి 38.2, ఉంగుటూరు 34.8, ఘంటసాల మండలంలో 33.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. పామర్రు మండలంలో 31.0 మిల్లీమీటర్లు, మచిలీపట్నం నార్త్, సౌత్, ఉయ్యూరు 30.6, మొవ్వ 29.4, గుడివాడ 27.0, పెడన 25.4, పమిడిముక్కల 24.4, బాపులపాడు, పెదపారుపూడి 22.8, కృత్తివెన్ను 20.2, బంటుమిల్లి 20.0, గుడ్లవల్లేరు 17.2, నందివాడ 17.6 మిల్లీమీటర్ల వర్షం పడింది.
తుపాను పునరావాస కేంద్రాల మూసివేత
పెనమలూరు: మోంథా తుపాను నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు మూసివేశారు. పెనమలూరు, పోరంకి, యనమలకుదురు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో సుమారు 500 మంది పేదలు తలదాచుకున్నారు. వారికి రోజున్నర పాటు అధికారులు ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించిన ప్రభుత్వ సిబ్బంది బుధవారం ఉదయం పేదలకు అల్పాహారం అందించి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. రెండు రోజులుగా పనులు లేవని, ఇప్పుడు ఇళ్లకు వెళ్లి ఏమిచేయాలని పేదలు వాపోయారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవటంతో ఇళ్లకు వెళ్లిపోయారు. తుపాను ముందు హడావుడి చేసిన అధికారులు, నేతలు పత్తాలేకుండా పోయారని బాధితులు ఆరోపించారు.
నేటి నుంచి
యథావిధిగా పాఠశాలలు
మచిలీపట్నంఅర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలు గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె.రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తుపాను ముప్పు కార ణంగా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభానికి యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. విద్యా ర్థులు యథావిధిగా విద్యాసంస్థలకు హాజరు కావాలని పేర్కొన్నారు.


