
బెట్టింగ్, మొబైల్ వ్యసనాల నుంచి బయటపడాలి
● 5కే రన్‌లో స్లేట్ వ్యవస్థాపకులు అమర్‌నాథ్
● రన్ ప్రారంభించిన నగర డీసీపీ కేవీజీ సరిత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆధునిక సమాజానికి బెట్టింగ్, జంక్‌ఫుడ్, మొబైల్ అడిక్షన్ వంటివి పంచ మహాపాథకాలుగా తయారయ్యాయని 5కే రన్‌లో వక్తలు పేర్కొన్నారు. సమాజ స్థితిగతులను మార్చి పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారద కళాశాల జంక్షన్ వద్ద స్లేట్, ది స్కూల్ ఆధ్వర్యంలో స్లేట్ స్మార్ట్ పేరిట 5కే రన్ నిర్వహించారు. ఈ రన్‌ను నగర డీసీపీ కేవీజే సరిత జెండా ఊపి ప్రారంభించారు. 1572 మంది రన్‌లో పాల్గొన్నారు. బెట్టింగ్, జంక్ ఫుడ్, రోట్ లెర్నింగ్, లోన్ యాప్స్, మొబైల్ అడిక్షన్ వంటి వాటికి వ్యతిరేకంగా స్లేట్ స్కూల్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించినట్లు వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్‌నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కుటుంబ శ్రేయస్సునే కోరుకుంటే అది స్వార్థమవుతుందని, సమాజ సేవకు నడుబిగించాలని పిలుపునిచ్చారు. డీసీపీ కేవీజే సరిత మాట్లాడుతూ బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఆ అలవాట్లు ఉన్న వారు వాటి నుంచి బయటపడాలని కోరారు. స్వీయ తెలివితేటలు, హార్డ్ , స్మార్ట్ వర్క్‌తో ముందుకు సాగాలన్నారు. పొదుపు, సహజ రుచులు, సాంకేతిక పరిజ్ఞానం సక్రమ వాడకం, బట్టీ చదువుల్ని వదిలి, విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే చదువులపై దృష్టి పెట్టాలన్నారు. సామాజిక అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని కోరారు. 5కే రన్‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు.