సూపర్‌ సిక్స్‌ హామీలు వెంటనే అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ హామీలు వెంటనే అమలు చేయాలి

Oct 20 2025 9:39 AM | Updated on Oct 20 2025 9:39 AM

సూపర్‌ సిక్స్‌ హామీలు వెంటనే అమలు చేయాలి

సూపర్‌ సిక్స్‌ హామీలు వెంటనే అమలు చేయాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్‌సిక్స్‌ హామీలు వెంటనే అమలు చేయాలని, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర 16వ మహాసభ తీర్మానించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి తెలిపారు. ఇటీవల జరిగిన 16వ రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలను ఆమె ఆదివారం గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సరళీకరణ ఆర్థిక విధానాల వలన మహిళా రంగంలో జరుగుతున్న మార్పులపై చర్చించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వలస మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోతున్నాయని చెప్పారు. డ్వాక్రా గ్రూపులలో అవినీతిని అరికట్టాలని, డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా రు.10 లక్షలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, మైక్రో ఫైనాన్స్‌ దోపిడీ నుంచి కుటుంబాలను రక్షించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని విన్నవించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉచిత గ్యాస్‌ కొంతమందికే ఇస్తున్నారని, ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు రు.1500 ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి వి.సావిత్రి, కోశాధికారి డి.శ్రీనివాసకుమారి, ఉపాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement