
గురుధాంలో పీవీ సింధు దంపతులు
బలుసుపాడు(జగ్గయ్యపేట): గురుధాం క్షేత్రాన్ని ఒలంపిక్ విజేత, పద్మభూషణ్, అర్జున్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సద్గురు శివానందమూర్తి పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వ్యవస్థాపకుడు గెంటేల వెంకట రమణ దంపతులు వారిని సత్కరించారు. అనంతరం సింధు మాట్లాడుతూ గురుధాం క్షేత్రానికి తన చిన్నతనం నుంచే వస్తున్నానన్నారు. తమ తల్లిదండ్రుల సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శివానంద కృప సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ):కేటీరోడ్డు పరిధిలోని భీమనవారిపేటలో ఓ మెడికల్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు ఆదివారం గుర్తించారు. లంబాడీపేటలోని రాకేష్ మెడికల్ స్టోర్స్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మెడికల్ షాపు మెట్లపై ఓ యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. అయితే స్థానికులను ఆరా తీయగా ఆ వ్యక్తి ఏలూరుకు చెందిన కె. శేఖర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడని తెలిసింది. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు.