
మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొస్తాం
కృష్ణా వర్సిటీ ఉపకులపతి
ఆచార్య కూన రాంజీ
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్టడీ గైడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కడియాల సునీత బృందం ఉన్నత విద్య, కెరీర్ గైడెన్స్‌పై ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ గత సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు నూటికి నూరు శాతం ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈసారి కూడా మరిన్ని బహుళజాతి సంస్థలను ప్రాంగణ ఎంపికల కోసం వర్సిటీకి తీసుకొస్తామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఆర్‌ఎం అమరావతి యూనివర్సిటీ ప్రాఫెసర్ ఆచార్య జీవీ చలం మాట్లాడుతూ గతంలో కంటే ఈ రోజుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు కావలసినన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ విజయకుమారి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ కల్యాణమండపంలో నిత్యాన్నదానం ప్రారంభం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ కల్యాణ మండలంలో ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు సౌకర్యంగా కూర్చొని భోజనం చేసేందుకు టీటీడీ కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో పంక్తికి 200 మంది కూర్చుని భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొస్తాం