
పాపం.. పసుపు రైతు!
వరదల ధాటికి
విలవిల్లాడుతున్న వైనం
పంటంతా ముంపునకు గురై ఎండిపోతున్న పరిస్థితి
కన్నెత్తి చూడని అధికారులు
ఒకటి, రెండు రోజుల్లో..
చల్లపల్లి: ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా కరకట్ట దిగువున ఉన్న మెట్ట పొలాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా పుసుపు పంటపై వరద తీవ్ర ప్రభావం చూపింది. వరద తాకిడికి గురైన పసుపు పొలాలు క్రమంగా ఎండిపోతున్నాయి. చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు పంచాయతీ పరిధిలోని 194 ఎకరాలు, నిమ్మగడ్డలో, వెలివోలు ప్రాంతాల్లో మరో 80 ఎకరాలు మొత్తం 274 ఎకరాల వరకూ పసుపు సాగు చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు.
భారీగా ఖర్చులు..
ఇప్పటివరకూ ఎకరా పసుపు సాగుచేసేందుకు విత్తనానికి రూ.37,500, ఎరువులకు రూ.30వేలు(మూడు కోటాలు), కూలీ ఖర్చులకు రూ.20వేలు మొత్తం ఎకరాకు రూ.90వేల నుంచి రూ.1లక్ష వరకూ పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వరదల వల్ల 150 ఎకరాలకు పైగా పసుపు నీట మునిగిందని అంచనా. అయితే వరదలో మునిగిన పంటలకు బీమా వర్తించదని అధికారులు చెబుతుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.
చల్లపల్లి మండలంలో ఇప్పటి వరకూ ఈ–క్రాప్ చేయించుకున్న దాని ప్రకారం 207 ఎకరాల్లో పసుపు పంట రైతులు సాగు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు నమోదు చేస్తాం. వరదల వల్ల మునిగి, పాడైపోయిన పంటలకు బీమా వర్తించదు.
– జె.కీర్తి, ఏఓ, హార్టికల్చర్

పాపం.. పసుపు రైతు!