బోర్డు నియామకం.. వివాదాస్పదం | - | Sakshi
Sakshi News home page

బోర్డు నియామకం.. వివాదాస్పదం

Oct 4 2025 6:26 AM | Updated on Oct 4 2025 6:26 AM

బోర్డు నియామకం.. వివాదాస్పదం

బోర్డు నియామకం.. వివాదాస్పదం

బోర్డు నియామకం.. వివాదాస్పదం

మా కూతురి ఆత్మ క్షోభిస్తుంది..

దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్‌గా

రేపూడికి చెందిన తరిగొప్పల పార్వతి

కోడలి హత్య కేసులో కొడుకు,

భర్తతో కలిసి జైలుకెళ్లొచ్చిన పార్వతి

నిందితులకు పదవులు ఎలా ఇస్తారంటూ మృతురాలి తల్లిదండ్రుల ఆగ్రహం

జి.కొండూరు: ప్రఖ్యాతిగాంచిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి బోర్డు నియామకం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా చిన్న చిన్న దేవాలయాల కమిటీల నియామకంలోనే జాగ్రత్తలు పాటించే తరుణంలో కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి ఏర్పాటులో హత్య కేసు నిందితులకు చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడలి హత్య కేసులో భర్త, కొడుకుతో కలిసి జైలుకెళ్లి వచ్చిన మహిళకు బోర్డు డైరెక్టర్‌ పదవి కట్టబెట్టడంపై బాధిత కుటుంబంతో పాటు సొంత పార్టీ నేతలు, దుర్గమ్మ భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

హత్య కేసు నిందితురాలు డైరెక్టరా?

ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు మండల పరిధి రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల పార్వతిని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి బోర్డులో డైరెక్టర్‌గా నియమించారు. అయితే తరిగొప్పల పార్వతి ఆమె భర్త తరిగొప్పల హుస్సేన్‌, కొడుకు సీతారామరాజు 2022లో ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చారు. వివరాలలోకి వెళ్తే.. తిరువూరుకు చెందిన వేముల గుర్నాథం, వేముల భాగ్యలక్ష్మి కుమార్తె వేముల అభినవ్య(20)ని ఏ.కొండూరు మండల పరిధి రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల పార్వతి, హుస్సేన్‌ల కుమారుడు సీతారామారాజుకి ఇచ్చి ఆగస్టు 13వ తేదీ, 2020లో వివాహం జరిపించారు. అయితే సీతారామారాజు అనకాపల్లిలో నివాసం ఉంటూ తునిలోని ఓ కెమికల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో వివాహం అయిన తర్వాత భార్య అభినవ్యను కూడా తన వెంట తీసుకెళ్లి అనకాపల్లిలో ఉంచాడు. అయితే అక్టోబర్‌ 10, 2022లో అభినవ్య హత్యకు గురైంది. అప్పటికే కొంతకాలంగా వరకట్నం కోసం అభినవ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉండడంతో అభినవ్య మామ తరిగొప్పల హుస్సేన్‌, అత్త పార్వతి, భర్త సీతారామారాజులు కలిసి హత్య చేశారని అభినవ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏ1గా సీతారామారాజు, ఏ2గా హుస్సేన్‌, ఏ3గా పార్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 90 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

డబ్బులతో రాజీ చేసేందుకు ప్రయత్నాలు..

కోడలి హత్య కేసులో నిందితులుగా ఉన్న తరిగొప్పల పార్వతి, ఆమె భర్త హుస్సేన్‌లు కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులకు డబ్బులు ఇస్తామంటూ బేరసారాలు మొదలు పెట్టారని సమాచారం. నిందితులు ఇస్తామంటున్న డబ్బుకు బాధిత కుటుంబ సభ్యులు లొంగకపోవడంతో పాటు నిందితురాలికి పదవి ఇవ్వడంపై మీడియా మందుకు వచ్చి తమ గోడును వినిపించారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని క్రూరంగా కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కోడలిని హత్య చేసి జైలుకెళ్లిన పార్వతికి దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్‌ పదవి ఇవ్వడం అంటే మా కూతురి ఆత్మ క్షోభిస్తుంది. ఆ కేసులో ఇంకా తీర్పు రాలేదు. ఇటువంటి సమయంలో నేరస్తురాలికి ప్రముఖ దుర్గగుడి లో పాల మండలి డైరెక్టర్‌ పదవి ఇవ్వడం అంటే ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. పార్వతిని డైరెక్టర్‌ పదవి నుంచి వెంటనే తొలగిస్తే మా కూతురు ఆత్మ శాంతిస్తుంది.

– వేముల గుర్నాథం, భాగ్యలక్ష్మి,

తిరువూరు, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement