
కొనసాగుతున్న భవానీల రద్దీ..
ఉత్సవాలలో 11వ రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులు దర్శనమిచ్చారు. గురువారం తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం రెండు గంటల నుంచి భవానీలు, భక్తులను అనుమతించారు. చివరి రోజున రికార్డు స్థాయిలో భవానీలు తరలివచ్చారు. ఆయా కంపార్టుమెంట్లు, క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకునేందుకు 5 గంటలకు పైగా సమయం పట్టింది. ఉదయం పూర్ణాహుతి అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించారు. గురువారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీల తాకిడితో కొండపైకి అన్ని వీఐపీ వాహనాలను, వీఐపీ ప్రవేశ మార్గాలను ఆలయ అధికారులు మూసివేశారు. కేవలం డ్యూటీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఘాట్‌రోడ్డు మీదగా నడుచుకుంటూ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. శుక్రవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఉత్సవాల ఏర్పాట్లు మరో రెండు రోజులు కొనసాగిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.