
పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతుల్లో భూసర్వే
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతులను అనుసరించి భూ సర్వే చేసి సంబంధిత రికార్డులను సజావుగా రూపొందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో పట్టణ సర్వే – నక్షా కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ భూ సంబంధ రికార్డు సర్వే ద్వారా పట్టణ ప్రణాళిక బలోపేతం చేసేందుకు సంసిద్ధం కావాలన్నారు. ఈ సర్వే ద్వారా పౌరులకు శాశ్వత భూ హక్కు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కమిటీలో జాయింట్ కలెక్టర్‌తో పాటు మునిసిపల్ కమిషనర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, డీపీవో, సర్వే ఏడీ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ జిల్లాస్థాయిలో సర్వే ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తుందని, క్షేత్ర స్థాయిలో సర్వే కార్యక్రమాల పనితీరును పర్యవేక్షిస్తుందని వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరిస్తుందన్నారు. సీఆర్డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ సునీత, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.