
వికటించిన ఇంజెక్షన్.. చిన్నారి మృతి
విషయం బయటకు రాకుండా ప్రాణాలకు వెలకట్టిన వైనం బందరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
మచిలీపట్నం అర్బన్: స్థానిక రామానాయుడుపేట సెంటర్లోని ఒక ప్రైవేట్ పిల్లల ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం మచిలీపట్నంలో కలకలం రేపింది. చింత చెట్టు సెంటర్‌కు చెందిన ఫాతిమా అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించటంతో చిన్నారి విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వెలుగులోకి రాకుండా డాక్టర్, ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. దీనిపై నగరంలోని నాయకులు పంచాయతీ నిర్వహించి, చిన్నారి ప్రాణాలకు విలువ కట్టడం మరింత వివాదాస్పదమైంది. చిన్నారి మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వైద్యుడు అధికార పార్టీ నేతలను ఆశ్రయించినా, తల్లిదండ్రులు, బంధువులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి స్థానిక టీడీపీ, బీజేపీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి పంచాయతీ పేరుతో చిన్నారి ప్రాణానికి రూ.లక్షలు వెలకట్టినట్లు సమాచారం. వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా ఆస్పత్రి వైద్యుడు, పంచాయతీ పెద్దలు తీవ్రంగా ప్రయ త్నించినా, విషయం బయటకు రావడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.