
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రాధాన్యం గల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తీరుతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రహదారి కష్టాలకు మద్దూరు–గోసాల రోడ్డు మార్గమే నిలువెత్తు నిదర్శనం.
ప్రయాణం.. నరకప్రాయం..
విజయవాడ–దివిసీమ కరకట్ట రహదారి నుంచి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మార్గం మద్దూరు– గోసాల రోడ్డు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్డు పూర్తిగా అడుగడుగునా గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్జిన్‌లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. మద్దూరు, వణుకూరు, గోసాల గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటుగా కరకట్ట మీదుగా విజయవాడ, దివిసీమ ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏలూరు రోడ్డు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా మద్దూరు–ఈడుపుగల్లు మీదుగా ఉప్పలూరు రోడ్డు మార్గాన్ని వినియోగిస్తుంటారు. నిత్యం అధిక సంఖ్య లో వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి.
అభివృద్ధి ఊసే లేదు..
దశాబ్దకాలం పైగా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి భారీ లోడుతో ఇసుక లారీలు ఈ మార్గం గుండానే ఇసుకను రవాణా సాగించాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతుల మయంగా తయారైంది. చిన్న పాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతేకాకుండా వాహనాలు అదుపుతుప్పి ప్రమాదాల బారిన పడటం, తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండటం ఇక్కడ సర్వసాధారణమైంది.
ఇంకెన్నాళ్లీ ‘దారి’ద్య్రం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం
గోసాల నుంచి మద్దూరు వైపు రోడ్డు దుస్థితి ఇది
శంకుస్థాపన చేస్తే.. పనులు రద్దు చేశారు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు మద్దూరు–గోసాల–ఉప్పలూరు రోడ్డు అభివృద్ధికి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించింది. సింగిల్ లైన్‌గా ఉన్న రోడ్డును ప్రజల అవసరాల రీత్యా డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అప్పటి మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ఈడుపుగల్లు సెంటరులో శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పనులు ప్రారంభానికి నోచలేదు. తదుపరి రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి పనులను రద్దు చేసింది. కొత్తగా మద్దూరు–గోసాల రోడ్డు అభివృద్ధికి రూ 6.50 కోట్లతో అంచనాలను నివేదించి సరిపెట్టేసింది.
గోతులమయంగా
మద్దూరు–గోసాల రహదారి

గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం

గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం