
పరుగులు పెట్టి.. పడిగాపులు
మంగళవారం ఇస్తామనడంతో రైతు సేవా కేంద్రాలకు తరలివచ్చిన వైనం సకాలంలో అధికారులు రాక ఇబ్బందులు
యూరియా కోసం అన్నదాతల ఆక్రందన
నాగాయలంక: మండలంలో రైతాంగానికి మంగళవారం యూరియా అందిస్తామని వ్యవసాయశాఖ సమాచారం అందించడంతో రైతులు పెద్ద సంఖ్య లో రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టి.. పడిగాపులు కాశారు. నాగాయలంకలోని బస్‌స్టేషన్ సమీపంలోని సేవా కేంద్రంలో ఉదయం 8గంటలకు రైతులకు యూరియా అందిస్తామని మెసేజ్‌లు పెట్టడంతో తెల్లవారుజాము నుంచే నాగాయలంక, మర్రిపాలెం, రేమాలవారిపాలెం రైతులు ఈ కేంద్రానికి తరలివచ్చారు. అయితే 10గంటలు దాటే వరకూ సంబంధిత అధికారులు రాకపోవడంతో రైతులు సంఖ్య భారీగా పెరిగింది. పరిస్థితితో ఆందోళన చెందిన నాగాయలంక ఎస్‌ఐ కె.రాజేష్ సేవా కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. అందరూ క్యూలో నిలబడి అధికారులకు సహకరించాలని నచ్చజెప్పారు.
40 టన్నులే స్టాక్..
ఇదే పరిస్థితి మండలంలోని భావదేవరపల్లి, సంగమేశ్వరం, పర్రచివర సేవాకేంద్రాల్లో నెలకొంది. వాస్తవానికి ఈ నాలుగు కేంద్రాలకు కలిపి 40టన్నులు స్టాక్ మాత్రమే అందించినట్లు ఏఓ ఎ.సంజీవకుమార్ చెప్పారు. మరో ఎనిమిది కేంద్రాలకు 80టన్నుల మేరకు ఇండెంట్ పెట్టామని రెండు రోజుల్లో వస్తుందని వివరించారు. 3ఎకరాల లోపు రైతు ఒక బస్తా, ఆపై ఉన్న రైతులకు రెండు బస్తాలు ఇస్తామని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రైతులు రావాలని, ఏ గ్రామాల పరిధిలో స్టాక్ వచ్చిందో ఆ పరిధిలో పొలం ఉన్న రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని ఏఓ సూచించారు. కాగా సంగమేశ్వరం రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న వెంకన్నస్వామి నిత్యం మద్యం మత్తులో జోగుతూ రైతులతో గొడవ పడతున్నాడు. ఆ వీడియోలు గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జేడీ దృష్టిలో పెట్టామని ఏఓ సంజీవ్ కుమార్ చెప్పారు.