
బెల్టు షాపు తొలగించాలంటూ రోడ్డెక్కిన మహిళలు
షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): మద్యం బెల్ట్ షాప్ తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేసిన సంఘటన షేర్‌మహ్మద్‌పేట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని గ్రామ సచివాలయానికి ఎదురుగా గత కొంతకాలంగా బెల్టు షాప్ నడుస్తోంది. మధ్యాహ్న సమయంలో షాపు వద్ద మందుబాబులు రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో గ్రామంలోని మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు మద్యం సీసాలను సమీపంలోని ప్రభుత్వ భవనాలు వద్ద పగలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఇటీవల అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వారు షాపు తొలగించే వరకు ఆందోళన చేస్తామని చెప్పడంతో కొద్దిసేపు ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయానికి షాపును పూర్తిగా తొలగిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ఎస్. నాగమణి సీపీఎం నాయకులు కోట కష్ణ, గౌస్ మియా, కాకనబోయిన వెంకటేశ్వర్లు, జుజ్జవరపు వెంకటరావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.