
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మంగళవారం రాత్రి వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఈ వ్యవసాయంలో విజయవంతమైన ఆదర్శ రైతులను గుర్తించి వారి అనుభవాలను ఇతర రైతులకు వివరించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించటం ద్వారా కూడా ప్రకృతి వ్యవసాయంలోని ప్రయోజనాలను రైతులకు తెలియజేయవచ్చన్నారు.
ఇతర పంటలవైపు..
కేవలం వరి పంటలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే రైతులను గుర్తించి వారి ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ సాగుతో పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు వివరించామన్నారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గిపోవటంతో పాటు వాటితో పండించే పంట వినియోగం వల్ల కలిగే అనారోగ్య దుష్ఫలితాలను వివరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధకశాఖ అధికారులు జె. జ్యోతి, చిననరసింహులు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, వ్యవసాయశాఖ డీడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ