
చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి
గన్నవరం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం గన్నవరంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గన్నవరం సగర్లపేటకు చెందన పొట్రు సతీష్(15) మానసిక దివ్యాంగుడు. పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన నక్క చైతన్య(12), మరో బాలుడితో కలిసి సతీష్ స్థానిక కోనాయి చెరువు పైలెట్ ప్రాజెక్ట్ వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. ప్రాజెక్ట్ పక్కనే ఉన్న తొండంగట్టు చెరువులో తామర పూలు కోసేందుకు ఇద్దరూ అందులోకి దిగారు. కొద్దిసేపటికి వారిద్దరూ నీట మునగడాన్ని వారి వెంట వెళ్లిన బాలుడు గమనించి, వారి కుటుంబ సభ్యులకు తెలిపాడు. చెంచులపేటకు చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయడంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారుల మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. సతీష్ తండ్రి నరసింహారావు గన్నవరం పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా, చైతన్య తండ్రి దుర్గారావు తాపీమేస్త్రిగా పని చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గన్నవరం పోలీసులు విచారణ చేపట్టారు.

చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి