
స్మార్ట్ మీటర్లు కాదు స్మార్ట్ బాంబులు
సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ
కృష్ణలంక(విజయవాడతూర్పు): అదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు వినియోగదారుల పాలిట స్మార్ట్ బాంబులని సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవనలో విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం స్మార్ట్‌మీటర్లను పెట్టొద్దని కోరుతూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లతో విద్యుత్ చార్జీలు మరింత భారం కానున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి విద్యుత్ చార్జీల భారంతోనే టీడీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్న సంగతి ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో మరోసారి టీడీపీ ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. అనంతపురం, గుడివాడ, విజయవాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లని వినియోగదారులు ధ్వంసం చేశారని తెలిపారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ ధరలను కూడా వినియోగదారులే చెల్లించాలన్నారు. వాడుకున్న యూనిట్ ధరలే కాకుండా, అదనంగా ఇంధన చార్జీలు, సుంకాలు, ట్రూఅప్ చార్జీలు, నిర్వహణ చార్జీలల పేరుతో వినియోగదారుల నడ్డి విరిచే ప్రయోగమే స్మార్ట్ మీటర్లని ఎద్దేవా చేశారు. న్యూడెమోక్రసీ నగర నాయకురాలు పద్మ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఉద్యమంలో మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు. రెడ్‌ఫ్లాగ్ పార్టీ నాయకుడు మరీదు ప్రసాద్‌బాబు మాట్లాడుతూ మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ఆగస్టు 5న విద్యుత్ ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. అనంతరం వక్తలు పలు తీర్మానాలు చేయగా సమావేశం ఆమోదించింది. మండలాలు, పట్టణాల్లో మీటింగ్‌లు జరపాలని, ఈ నెల 29 వరకు కరపత్రాలు పంపిణీ చేయాలని, సంతకాల సేకరణ, ఇంటింటి ప్రచారం, 30 నుంచి ఆగస్టు 4 వరకు సమావేశాలు, పాదయాత్రలు, ప్రచారం, ప్రభాత భేరీలు నిర్వహించాలని, ఆగస్టు 5న విద్యుత్ సబ్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు, ఆందోళనలు చేయాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వెంకటేశ్వరరావు, ఎన్‌సీహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.