
విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనను అందించడంతో పాటు సృజనాత్మక శక్తిని వెలికితీసేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో ఎ.కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెంలలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో మైనార్టీ విద్యార్థులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఐకాన్ స్కూల్స్ మార్చేందుకు చర్యలు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) ద్వారా జిల్లాలోని 29 పాఠశాలలను ఎంపిక చేసి మూడు దశలలో ఐకాన్ స్కూల్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ. 6.72 కోట్లు మంజూరు చేసి రూ.4.72 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఇప్పటికే రూ.2.32 కోట్ల విలువైన పనులను పూర్తిచేశామన్నారు. ఆయా స్కూల్స్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులు మెరుగైన పరిశోధనలు చేసేలా, వినూత్న ఆలోచనలను కార్యరూపమిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వారికి అవసరమైన ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సీఎంవో ఎన్.చంద్రశేఖర్, ఏఎంవో ఎస్.అశోక్‌బాబు, అసిస్టెంట్ ఏఎంవో శిరీష, ప్రోగ్రాం ఆఫీసర్ ఏవీవీ ప్రసాద్‌బాబు తదితరులు ఉన్నారు.