
ఆన్‌లైన్‌లో ఇంటి పన్ను చెల్లింపులు
డీపీఓ లావణ్య కుమారి
నున్న(విజయవాడరూరల్): స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే ఇంటి పన్ను చెల్లింపులు వచ్చే(ఆగస్టు) నెల నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతాయని జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్య కుమారి తెలిపారు. గురువారం నున్న గ్రామ పంచాయతీ రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వివరాలను, ఇంటి యజమాని పేరు, ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం జరిగిందనే వివరాలను ఆన్‌లైన్ చేస్తారన్నారు. ఇంటి యజమానులే ఆన్‌లైన్‌లో ఇంటి పన్ను, నీటి పన్ను, గ్రంథాలయం పన్ను, డ్రెయినేజీ పన్ను చెల్లించుకోవచ్చునన్నారు. ఈ విధానం ద్వారా దుర్వినియోగం ఉండదన్నారు. అందుకుగాను 2025–26వ సంవత్సరానికి గాను డిమాండ్లు తయారు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రూ.44 కోట్ల ఇంటిపన్ను గాను రూ.37 కోట్లు వసూలు చేశామన్నారు. ఇక మీదట కొత్తగా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు ఇంటి పన్ను విధింపు ఐజీఆర్‌ఎస్‌ను అనుసరించి నిర్ణయిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ విలువను బట్టి ఇంటి పన్ను నిర్ణయిస్తామన్నారు.
నేడు కూడా కొనసాగనున్న ఐటీఐ కౌన్సెలింగ్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఎన్టీ ఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి బుధ, గురు వారాలు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయిన వారి కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ తీసుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలియజేశారు. ఇతర వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో నేరుగా కాని, 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో కాని సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
ఎన్టీఆర్ జిల్లాలో 4.38
మిల్లీమీటర్ల సగటు వర్షపాతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు 4.38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 10.4, విజయవాడ రూరల్‌లో 9.6, నార్త్‌లో 7.8, సెంట్రల్, వెస్ట్‌లో 7.6, ఈస్ట్‌లో 7.4, గంపలగూడెంలో 6.0, జగ్గయ్యపేటలో 5.2, ఎ.కొండూరులో 4.0, తిరువూరులో 3.6, జి.కొండూరులో 3.4, చందర్లపాడులో 3.4, వీరులపాడులో 3.4, రెడ్డిగూడెంలో 3.2, కంచికచర్లలో 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.