
ఉప్పొంగుతున్న ఏటిపాయ
కంకిపాడు: వరదనీటితో ఏటిపాయ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గురువారం నాటికి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మండల పరిధిలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ వరదనీటితో ఉధృతంగా పొంగి పొర్లుతోంది. వరదనీరు ఉరకలు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది.
కోతకు గురైన అంతర్గత రహదారి
కృష్ణానది ఏటిపాయలో మద్దూరు వద్ద పుచ్చలలంక ప్రాంతానికి రైతులు, కూలీలు వెళ్లేందుకు వీలుగా రహదారి మార్గం నిర్మించుకున్నారు. వరదనీటి ఉధృతితో అంతర్గత రోడ్డు కోతకు గురైంది. పలు చోట్ల రోడ్డు గండ్లు పడింది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు మరింత ధ్వంసమయ్యే పరిస్థితి ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఏటిపాయలో నీటి ఉధృతిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
పూర్తిగా స్తంభించిన రాకపోకలు
రెండురోజులుగా ఏటిపాయలోకి రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ఏటిపాయ రోడ్డు గండ్లు పడి ధ్వంసం కావటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏటిపాయలోకి పొలం పనులకు సైతం రైతులు, కూలీలు వెళ్లలేని పరిస్థితి. పశువుల కాపరులు, జీవాల పెంపకందారులు ఏటిపాయ ఒడ్డున జీవాలు, పశువులకు మేతకు తీసుకెళ్తున్నారు. రోడ్డు ధ్వంసం కావటంతో ఏటిపాయలోని లంక భూములతో పాటుగా ఏటిపాయ గుండా అవతలి వైపున గుంటూరు జిల్లా గొడవర్రు, వల్లభాపురం, కొల్లిపర ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఏటిపాయలో నీటి ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ వి.భావనారాయణ నేతృత్వంలో అధికారులు ఏటిపాయను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తోడేళ్లదిబ్బలంకకు పడవలో రాకపోకలు
సాగిస్తున్న విద్యార్థులు
నీటి ఉధృతికి ధ్వంసమైన రహదారి నిలిచిన రాకపోకలు సమీక్షిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
తోట్లవల్లూరు: కృష్ణమ్మ పరవళ్లు తోట్లవల్లూరును తాకాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మిగులు నీటిని విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న విషయం విదితమే. దీంతో మండలంలోని రొయ్యూరు రేవుకు బుధవారం రాత్రే వరద నీరు చేరుకుంది. కృష్ణానదికి వరద నీటి రాకతో లంకలకు వెళ్లే తాత్కాలిక రహదారులు కోతకు గురై నీట మునిగాయి. వరద రాకతో పాములలంక, తోట్లవల్లూరు, రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బలంకతో పాటు పలు లంక గ్రామాలకు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. కృష్ణానదికి వరద రాక దృష్ట్యా లంక గ్రామాల ప్రజలు, కరకట్ట వెంబడి గ్రామాల రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.కుసుమకుమారి సూచించారు.

ఉప్పొంగుతున్న ఏటిపాయ