
మున్సిపల్ కమిషనర్ల సంఘ సమస్యల పరిష్కారానికి వినతి
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ల సంఘం(ఏపీఎంసీఏ) ప్రతినిధి బృందం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంఘం తరఫున మంత్రికి ఇతర శాఖల నుంచి మున్సిపల్ కమిషనర్లుగా డెప్యుటేషన్‌పై నియమించడం, అలాగే శాశ్వతంగా ఇతర శాఖల అధికారులను మున్సిపల్ పరిపాలనలో మార్చడం, మున్సిపల్ కమిషనర్ల హక్కులను హరించడమేనని వినతిపత్రం అందించారు.
ప్రత్యేక శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి..
మున్సిపల్ పరిపాలనలో అనుభవజ్ఞులైన అధికారులకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని, అన్ని స్థాయిలలో సమయానుకూలంగా పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్‌ను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ వ్యవహారాలపై ప్రత్యేక శిక్షణ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా అధికారులకు అభివృద్ధి పరమైన సమగ్ర దిశానిర్దేశం అందించవచ్చుని, అందుకు సంస్థ నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని విపతిపత్రంలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లపై పెండింగ్‌లో ఉన్న ఆర్థికేతర అభియోగాల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంఘ అధ్యక్షుడు నాగ నరసింహరావు, ప్రధాన కార్యదర్శి బి.బాలస్వామి, విశాఖపట్నం ప్రాంతీయ సంచాలకులు(ఆర్‌డీఎంఏ) వి.రవీంద్ర, ఉపాధ్యక్షుడు భవాని ప్రసాద్, ట్రెజరర్ శివారెడ్డి సంఘ కార్యవర్గ సభ్యులు, నిర్వాహక కార్యదర్శులు పాల్గొన్నారు.
చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష
విజయవాడలీగల్: చెక్ బౌన్స్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుదరవల్లి వెంకట నర్సయ్యకు ఏడాది జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తవ్వా ప్రకాష్‌బాబు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే మాచవరానికి చెందిన బోడి సీతారామరాజు వద్ద 2020వ సంవత్సరంలో నర్సయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో సీతారామరాజుకు రూ.17.70 లక్షల చెక్‌ను ఇచ్చాడు. చెక్ బౌన్స్ అవ్వడంతో సీతారామరాజు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇరువురి న్యాయవాదుల వాదనలు విన్న ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నర్సయ్యకు ఏడాది జైలు శిక్ష, 2 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.