
యూరియా కోసం రైతుల బారులు
కోడూరు: ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా ప్రభుత్వం యూరియా సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కోడూరు రైతు సేవా కేంద్రం వద్ద అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు. బయట మార్కెట్‌లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రభుత్వం అందించే యూరియా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం 45కేజీ యూరియా బస్తాను రూ.266.50కు రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయిస్తోంది. అయితే కోడూరులోని ఎరువుల దుకాణాల్లో అదే 45 కేజీ బస్తాను వ్యాపారులు రూ.350కు పైగా విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో యూరియా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్‌లో కొని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఇటీవల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియాను ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కోడూరులోని ఎరువుల వ్యాపారులు యూరియా విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు.
యూరియా లారీని చూసి..
ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రైతులు నారుమళ్లు సిద్ధం చేయగానే యూరియా తప్పని సరిగా చల్లాల్సి ఉంటుంది. దీంతో బయట మార్కెట్‌లో యూరియా దొరక్క పోవడంతో రైతులు ప్రభుత్వం అందించే యూరియాపైనే ఆశలు పెట్టుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కోడూరు రైతు సేవా కేంద్రం వద్దకు 25 టన్నుల లోడు కలిగిన యూరియా లారీ రావడాన్ని గమనించిన రైతులు కేంద్రం వద్దకు పరుగులు పెట్టారు. యూరియా దక్కించుకొనేందుకు కేంద్రం ముందు క్యూ కట్టి బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు మధ్య ఘర్షణలు కూడా జరిగాయి.
తొలుత ఆధార్ ఆపై పాసుపుస్తకం..
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతల కష్టాలు
తొలుత కేంద్రంలోని ఉద్యోగులు రైతుల ఆధార్ కార్డుల జిరాక్స్‌లను తీసుకొని యూరియా విక్రయించారు. రైతుల తాకిడి ఎక్కువ కావడంతో ఉద్యోగులు సైతం చేతులెత్తేసి పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్‌పుస్తకం ఉంటేనే యూరియాను విక్రయిస్తామని చెప్పారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. గురువారం నుంచి యూరియాను కేంద్రంలో విక్రయిస్తామని రైతులు తప్పనిసరిగా పట్టాదార్ పాస్‌పుస్తకాల జిరాక్స్ తీసుకురావాలని చెప్పి, యూరియా సరఫరాను నిలిపివేశారు. దీంతో క్యూలో నిలబడిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మండలాధికారి శ్రీధర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.